కాంగ్రెస్ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు..మూడు చోట్ల ఎన్నికలు వాయిదా 

కాంగ్రెస్ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు..మూడు చోట్ల ఎన్నికలు వాయిదా 
  • జనగామ, తొర్రూరులో లాటరీ.. రెండుచోట్ల కాంగ్రెస్‌‌కే లక్కీ
  • మొత్తం 90 మున్సిపాలిటీలు, 
  • 5 కార్పొరేషన్లలో అధికార పార్టీ పాగా 
  • 19 చోట్ల బీఆర్ఎస్​, రెండు చోట్ల బీజేపీ
  • ఒక చోట ఫార్వర్డ్​ బ్లాక్​, 4 చోట్ల కొలువుదీరిన ఇండిపెండెంట్లు 
  • ముగిసిన మున్సిపల్ ఎన్నికలు..
  • 22  రోజుల తర్వాత  ఎలక్షన్ ​కోడ్ ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు చేరాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో అధికార పార్టీ పాగా వేసింది. 19 చోట్ల బీఆర్‌‌‌‌ఎస్​ గెలవగా, కరీంనగర్​ కార్పొరేషన్, నారాయణ పేట మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకున్నది. వడ్డేపల్లిలో ఫార్వర్డ్​ బ్లాక్​,  భైంసా, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కొలువుదీరారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలను వివిధ కారణాలతో రెండోసారి వాయిదా వేశారు.

ఇబ్రహీంపట్నం పాలకవర్గ ఎన్నికలు జరగకుండా హైకోర్టు 2 రోజులపాటు స్టే విధించింది.  స్టే వచ్చే లోపే అక్కడ మున్సిపాలిటీలో చైర్ పర్సన్​ ఎన్నికలను అధికారులు నిర్వహించారని, తమ అభ్యర్థి గెలిచినట్లు బీఆర్‌ఎస్​ ప్రచారం చేసుకుంటున్నది. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నికల​ అధికారులు ఈ మున్సిపాలిటీ చైర్‌‌ పర్సన్​ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించకుండానే వాయిదా వేసినట్లు ప్రకటించారు.

మొత్తానికి రాష్ట్రంలో మున్సిపల్​ ఎన్నికలు విజయవంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 22 రోజుల తర్వాత ఎలక్షన్​ కోడ్​ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. రెండోరోజు పాలకవర్గ ఎన్నికల సందర్భంగా క్యాతనపల్లిలో మంత్రి వివేక్​ కాన్వాయ్‌పై బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్​, బీఆర్‌‌ఎస్​కు చెందిన అతని అనుచరులు రాళ్లతో దాడిచేశారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు, కాంగ్రెస్​ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొర్రూర్, జనగామతో పాటు ఇతర ప్రాంతాల్లో గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

22  రోజుల తర్వాత ఎలక్షన్ ​కోడ్ ఎత్తివేత

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ రాణి కుముదిని గత నెల 27న రాష్ట్రంలో మున్సిపల్​ ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ చేశారు. గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అదే రోజు నుంచి ఎన్నికలు జరిగే చోట్ల ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చింది.

జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజులపాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల స్క్రూటినీ, విత్​ డ్రాలు పూర్తిచేసి అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు.  అదేరోజు 12 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు. ఇవిపోగా మిగిలిన 2,982 వార్డులకు   ఫిబ్రవరి 11న ఎలక్షన్‌ నిర్వహించారు.

 రాష్ట్రవ్యాప్తంగా 38.09 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73 శాతం పోలింగ్​ జరిగింది. ఈ నెల 13న కౌంటింగ్​ నిర్వహించి.. మొత్తం 2,995 వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్​ పార్టీ  39.80 శాతం ఓట్లతో 1,537 వార్డులను, బీఆర్ఎస్​ 28.75 శాతం  781 వార్డులను, బీజేపీ 15.67 శాతం ఓట్లతో 336 వార్డులను గెలుచుకున్నాయి.

ఈ నెల 16న గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌‌ పర్సన్​, వైస్ చైర్‌‌ పర్సన్​ ఎన్నికలు నిర్వహించారు. మొదటి రోజు సోమవారం 7 కార్పొరేషన్లు, 105 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 11 మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదాపడగా, మంగళవారం నిర్వహించారు. 

మెజార్టీ స్థానాలు అధికార పార్టీవే..

రాష్ట్రంలో రెండు దఫాలుగా జరిగిన మున్సిపల్​ పాలకవర్గాల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్​ పార్టీ గెలుచుకున్నది. మొత్తం 113 మున్సిపాలిటీలకుగానూ 90 చోట్ల(సుమారు 80శాతం)  చైర్‌‌ పర్సన్​ సీట్లను, 7 కార్పొరేషన్లలకుగానూ 5 చోట్ల మేయర్​ పీఠాలను కైవసం చేసుకున్నది. పొత్తులో భాగంగా కొత్తగూడెం డిప్యూటీ మేయర్, ఇస్నాపూర్, అమరచింత డిప్యూటీ చైర్‌‌ పర్సన్​ పదవులను దక్కించుకున్నది.

ఆదిలాబాద్, మహబూబాబాద్‌లో మేయర్​ సీటును దక్కించుకున్న వాళ్లు ఇండిపెండెంట్​క్యాండిడేట్స్​ అయినప్పటికీ వీళ్లు కాంగ్రెస్​ సహాకారంతో చైర్‌‌ పర్సన్‌గా గెలిచినవాళ్లే. ఎన్నికలు ముగిసిన వెంటనే వీళ్లు కాంగ్రెస్​ పార్టీలో చేరిపోయారు. బీఆర్‌‌ఎస్​ పార్టీ కేవలం 19 మున్సిపాలిటీలకే పరిమితమైంది. 19 చోట్ల బీఆర్‌‌ఎస్​ చైర్‌‌ పర్సన్​ సీట్లను దక్కించుకోగా.. లాటరీ తీయడంతో జనగామ వైస్​ చైర్మన్​ సీటు దక్కింది. అలాగే పొత్తులో భాగంగా ఐదు చోట్ల వైస్​ చైర్​పర్సన్​ సీట్లను బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు 
వదులుకున్నది. 

8 మున్సిపాలిటీల్లో 7 కాంగ్రెస్‌కు.. ఒకటి బీఆర్‌‌ఎస్‌కు​!

రాష్ట్రంలో సోమవారం వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలకు మంగళవారం పాలకవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఇందులో 8 చోట్ల ఎన్నికలు పూర్తికాగా,  అనివార్య కారణాలతో ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వీటిలో ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్‌నగర్, జహీరాబాద్, డోర్నకల్,  జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల చైర్‌‌ పర్సన్​ సీట్లను కాంగ్రెస్​ గెలుచుకోగా, ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌‌ఎస్​ ఖాతాలో చేరింది.

వీటిలో తొర్రూరు, జనగామలో కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్​ తరఫున పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు  సమాన ఓట్లు(ఎక్స్​ అఫీషియో ఓట్లతో కలిపి)  రాగా.. ఎన్నికల అధికారులు లాటరీ తీశారు. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. కాగజ్‌నగర్​ వైస్​ చైర్​పర్సన్​ ఎన్నికకు సైతం లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది.

కాగజ్​నగర్​ చైర్‌‌ పర్సన్​ ఎన్నికల్లో పాల్గొని ఓటేసిన బీజేపీ కౌన్సిలర్​ శివగౌడ్, తీరా వైస్​చైర్‌‌ పర్సన్​ ఎన్నికల ఓటింగ్​ సమయానికి బయటికి వెళ్లిపోయారు. దీంతో బీఆర్‌‌ఎస్​, బీజేపీకి చెరో 15 ఓట్లు రాగా మున్సిపాలిటీ వైస్​ చైర్మన్‌​ కూడా లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని డాక్టర్ కొత్తపల్లి అనిత గెలిచినట్లుగా ప్రకటించారు.